GuidePedia

0


రాజమండ్రి : 

ఏపీలో జరిగిన పుష్కరాల్లో మహా ఘోరం నెలకొంది. కన్నుల పండుగగా ప్రారంభమైన రెండు గంటల్లో కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. రాజమండ్రి పుష్కర ఘాట్ మొదటి ద్వారం వద్ద జరిగిన తొక్కిసలాటలో 20 మంది యాత్రికులు కన్నుమూశారు. చాల మంది యాత్రికులు గాయాలకు గురయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక తప్పిపోయిన వారి సంఖ్య వందల్లో ఉంటుందని సమాచారం. తమ బిడ్డ ఎక్కడుందో తల్లికి తెలియదు..అమ్మ ఎక్కడుందో కుమారుడికి తెలియదు..ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం రాజమండ్రిలో చోటు చేసుకుంది. ఒక్కసారి ఈ ఘటన చోటు చేసుకోవడంతో అంతా అందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.





ఒకే స్ట్రెచర్ పై ఇద్దరి మృతదేహాలు..
మృతి చెందిన యాత్రికులను తరలించడానికి అధికారులు కనీస ఏర్పాట్లు చేయకపోవడం విచారకరం. సుమారు రెండు గంటల అనంతరం మృత దేహాలను తరలించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. మృతి చెందిన మహిళల మృతదేహాలను ఒక్క స్ట్రెచర్ పైనే పెట్టి తరలించడం చూసిన భక్తులు విస్మయానికి గురయ్యారు. మృతి చెందిన వారిని గుట్టు చప్పుడు కాకుండా తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ ఘటనపై భక్తులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
నా భార్యను పోలీసులే చంపేశారు..
తన భార్యను పోలీసులే చంపేశారని ఓ భర్త కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఇక్కడ ఎలాంటి చర్యలు లేవని వాపోయాడు. ఎలాంటి క్రమశిక్షణ లేదని రోదిస్తూ పేర్కొన్నాడు.
మేల్కోన్న అధికారులు...
ఘటన జరిగిన అనంతరం మేల్కోన్న అధికారులు చర్యలు చేపట్టారు. ఎన్ సిసి సిబ్బంది, వాలంటీర్లు రంగంలోకి దిగారు. వెంటనే భారీగా వస్తున్న యాత్రీకులను అరికట్టడంలో చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించారు. క్యూ లైన్ లు సక్రమంగా వెళ్లే విధంగా చూడడంలో నిమగ్నమయ్యారు.
మెడికల్ క్యాంపులు లేవు..
ఇక్కడ మెడికల్ క్యాంపులు దూరంగా ఏర్పాటు చేశారని ఓ వాలంటీర్ టెన్ టివితో పేర్కొన్నాడు. ఇక్కడ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించాడు.
అధికార యంత్రాంగం విఫలం..
''గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం..భారీగా ఖర్చు పెడుతున్నాం..పుష్కరాల్లో స్నానాలు ఆచరించండి..పుణ్యం సంపాదించుకోండి..భక్తులకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం'' అంటూ ఏపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. పుష్కరాలు మంగళవారం ఆరంభమయ్యాయి. కానీ ప్రభుత్వం పేర్కొన్నవన్నీ ఉత్తుత్తివే అని తెలిసిపోయింది. 12 ఏళ్లకొకసారి వచ్చే పుష్కరాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం ఘోరంగా విఫలం చెందింది. సుమారు ఐదు లక్షల జనాభా కలిగిన రాజమండ్రి లో పుష్కరాల్లో ఎంత మంది వస్తారనే అంచనాలో ఘోరంగా విఫలం చెందారు. భక్తులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందింది. రద్దీ పెరుగుతున్న సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలం చెందింది.

Post a Comment

 
Top